బచ్చన్నపేటలో ఎరువుల దుకాణాల తనిఖీబచ్చన్నపేటలో ఎరువుల దుకాణాల తనిఖీ

రైతులతో నేరుగా మాట్లాడిన జిల్లా కలెక్టర్

యూరియా కొరత లేదని స్పష్టం

యూరియా బుకింగ్ యాప్‌పై రైతుల సంతృప్తి

నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు

-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం బచ్చన్నపేట మండలంలో పర్యటించి,యాసంగి సీజన్‌లో రైతులకు యూరియా ఎరువుల సరఫరా,పంపిణీ పరిస్థితులు మరియు యూరియా బుకింగ్ యాప్ అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ హాకా గోపాల్ నగర్,పీఏసీఎస్ బచ్చన్నపేట,ఎంజీసీ బచ్చన్నపేట కేంద్రాలను సందర్శించి,అక్కడి యూరియా నిల్వలు,అమ్మకాలు,బుకింగ్ విధానం,రైతులకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్షించారు.గురువారం నాటికి పీఏసీఎస్ బచ్చన్నపేటలో 1067 బ్యాగులు,ఎంజీసీ బచ్చన్నపేటలో 333 బ్యాగులు,హాకా గోపాల్ నగర్‌లో 444 బ్యాగుల యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.మూడు కేంద్రాలలో ఉన్న రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి యూరియా బుకింగ్ యాప్‌పై అభిప్రాయాలు తెలుసుకున్నారు.యాప్ ద్వారా ముందుగానే బుకింగ్ చేసుకోవడం వల్ల వరుసలో నిలబడాల్సిన అవసరం లేకుండా,సమయం వృథా కాకుండా సులభంగా యూరియా పొందగలుగుతున్నామని రైతులు తెలిపారు.యాప్ అమలుతో పారదర్శకత పెరిగిందని,అనవసరమైన గందరగోళం తగ్గిందని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు అడగగా,కోతుల బెడద కారణంగా వేరుశనగ,చిరుధాన్యాలు వంటి పంటలను సాగు చేయలేకపోతున్నామని,ప్రధానంగా వరి పంటనే సాగు చేస్తున్నామని రైతులు కలెక్టర్‌కు తెలిపారు.ఈ సమస్యపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.జిల్లాలో యూరియా నిల్వల పరిస్థితిపై వ్యవసాయ అధికారులు వివరాలు వెల్లడించారు.ప్రస్తుతం రోజుకు సగటున సుమారు 7,500 బ్యాగుల యూరియా అమ్మకాలు జరుగుతున్నాయని,యూరియా బుకింగ్ యాప్‌కు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని తెలిపారు.యాప్‌లో నమోదవుతున్న బుకింగ్స్ సంఖ్య రైతుల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.కేంద్ర రిజర్వ్ పూల్ నుండి జనగాం జిల్లాకు 2000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు జరిగిందని అధికారులు తెలిపారు.ఇందులో భాగంగా మార్క్‌ఫెడ్‌కు 29,333 బ్యాగుల యూరియాకు ఇండెంట్ ఇవ్వగా,ఇప్పటికే 12,888 బ్యాగులు జిల్లాకు చేరాయని తెలిపారు.మిగిలిన 16,445 బ్యాగులు ఒక రోజులో జిల్లాకు చేరనున్నట్లు పేర్కొన్నారు.అదనంగా బఫర్ స్టాక్‌లో ఉన్న 15,111 బ్యాగులకు ఈ రోజే ఇండెంట్ ఇవ్వగా,అవి శనివారానికి జిల్లాకు అందుబాటులోకి వస్తాయని వివరించారు.అలాగే ప్రైవేట్,మార్క్‌ఫెడ్ ద్వారా మరిన్ని రేకులు జిల్లాకు రానున్నందున యూరియా కొరతకు ఎలాంటి అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..యూరియా పంపిణీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగాలని,యూరియా బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలని అధికారులను ఆదేశించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సమయంలో అవసరమైన పరిమాణంలో యూరియా అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.జిల్లాలో తగినంత యూరియా నిల్వలు ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు.ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని,వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *