సంత్ సేవాలాల్ జీవితం నేటి యువతకు ఆదర్శంసంత్ సేవాలాల్ జీవితం నేటి యువతకు ఆదర్శం

స్టేషన్ ఘనపూర్‌లోని పద్మావతి గార్డెన్స్‌లో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్‌లోని అంబేద్కర్ విగ్రహం నుండి జఫర్‌గడ్ రోడ్‌లోని పద్మావతి గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బంజారా ఆడపడుచులు సంప్రదాయ వస్త్రధారణలో పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య కూడా వారితో కలిసి నృత్యం చేసి ఉత్సాహం నింపారు.అనంతరం భోగ్ బండార్ నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, బంజారా సమాజానికి మార్గదర్శిగా నిలిచిన సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం త్యాగం, సేవ, సమానత్వానికి ప్రతీక అని అన్నారు. ఆయన బోధనలు నేటి యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. బంజారా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే కాకుండా వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల ద్వారా బంజారా సమాజాన్ని ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. ఆడపిల్లల విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకుని పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చాలని సూచించారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, 1739లో ఒక చిన్న మారుమూల తండాలో జన్మించిన సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాలలో చైతన్యం కల్పించేందుకు విశేషంగా కృషి చేశారని తెలిపారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బంజారా భవన్ నిర్మాణం వేగంగా జరుగుతోందని, అది పూర్తయితే అన్ని కార్యక్రమాలు అక్కడే నిర్వహించవచ్చని అన్నారు.నియోజకవర్గంలోని 27 తండా గ్రామపంచాయతీలలో భవనాలు లేని తండాలకు వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.అన్ని తండాలకు ఇప్పటికే బీటీ రోడ్లు వేసినట్లు పేర్కొన్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని చెప్పారు.ప్రతి తండా గ్రామపంచాయతీకి 15 రోజుల్లో రూ.5 లక్షల నిధులు మంజూరు చేస్తానని వెల్లడించారు.త్వరలోనే 27 తండా సర్పంచ్‌లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులపై చర్చిస్తానని తెలిపారు.చదువుతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, మద్యపానం మరియు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకన్న, సేవాలాల్ గురు బీ రమేష్ మహారాజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వినయ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, తహసీల్దార్లు, ఎంపిడివోలు, 27 తండా గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, జెడ్పిటిసి సభ్యులు స్వామి నాయక్, రాజేష్ నాయక్, లాల్ నాయక్, వెంకటేష్, రమేష్ నాయక్ మరియు బంజారా మహిళలు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *