స్థానిక ఆదర్శ విద్యా నికేతన్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకల
తెలుగుగళం న్యూస్, పెద్దవడుగూరు.
స్థానిక ఆదర్శ విద్యా నికేతన్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం ఎంతో ఉత్సాహంగా, భక్తిభావంతో జరుపుకున్నారు. అధర్మాన్ని అణచి, ధర్మాన్ని నిలబెట్టేందుకు అవతరించిన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులు, తోరణాలతో సుందరంగా అలంకరించారు.ఈ వేడుకల్లో భాగంగా పాఠశాలలోని చిన్నారి విద్యార్థులంతా శ్రీకృష్ణుడు, రాధల వేషధారణలతో హాజరయ్యారు. నెమలి పించాలు, చేతిలో పిల్లనగ్రోవులతో చిరునవ్వులు చిందిస్తూ చిన్నారి కృష్ణులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కృష్ణ లీలల నాటికలు, గోపికల నృత్యాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఉట్టి కొట్టే (దహీ హండీ) కార్యక్రమం. ఉపాధ్యాయులు పాఠశాల మైదానంలో ఎత్తుగా కట్టిన ఉట్టిని బద్దలు కొట్టేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. “గోవిందా.. గోపాలా..” అంటూ విద్యార్థులు చేసిన జయజయధ్వానాల మధ్య ఒక విద్యార్థి ఉట్టిని కొట్టడంతో మైదానమంతా చప్పట్లతో మారుమోగిపోయింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరణం నారాయణ రావు మాట్లాడుతూ.. మన సంస్కృతి, సాంప్రదాయాలను పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా అందించిన కర్తవ్య బోధనను, నీతిని విద్యార్థులు తమ జీవితంలో అన్వయించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.అనంతరం వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులకు కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకులు, వెన్న, పాయసాన్ని ప్రసాదంగా విద్యార్థులకు పంపిణీ చేయడంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
