పంటలు దగ్ధమైన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
మంటల్లో ప్రమాదవశాత్తు చిక్కుకొని మరణించిన మరియు ప్రమాదవశాత్తు పంటలు దగ్ధమైన రైతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా రేగొండ మండలం రేపాక పల్లి గ్రామ రైతు చాగర్ల చంద్రమౌళి భార్య భాగ్య తో కలిసి వరి పొలం కాడికి వెళ్లి గడ్డి తగలబెడుతుండగా గాలికి మంటలు విస్తరించి అందులో చిక్కుకొని సజీవ దహనం కావడం భర్తను కాపాడేందుకు ప్రయత్నించిన భార్య కూడా కాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు అంతా ఇంతా కాదన్నారు. వరిగడ్డి యంత్రాలతో తొలగించాలని ప్రభుత్వ అధికారులు చెబుతున్న చిన్న సన్న కారు రైతులకు అందుబాటులో లేనందున ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొగుళ్ల పెళ్లి మండలంలోని ఎల్లారెడ్డి పల్లి, పిడిసిల్ల గ్రామ శివారులో రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నలకు ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి రైతులు వనపర్తి రమేష్, నైనకంటి కృష్ణారెడ్డి, కదుర్ల రాజిరెడ్డి ,మేకల రాజు లకు చెందిన సుమారు 80 క్వింటాల మక్క జొన్నలు కాలి బూడిద కావడంతో అప్పులు చేసి ఎన్నో వ్యయ ప్రయాసలపడి పండిస్తే చేతికి వచ్చిన పంట దగ్ధమై పోయి విలపిస్తున్నారన్నారు. సకాలంలో మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో పలువురు రైతుల కరెంటు వైర్లు పైపులు స్టార్టర్లు మోటార్లు దగ్ధం కావడంతో తీవ్రంగా నష్టపోయి బాధపడుతున్నారన్నారు. “ఎద్దు ఏడ్చిన ఎవుసం–రైతు కన్నీరు పెట్టిన రాజ్యం” బాగుపడినట్టు చరిత్రలో లేదన్న విషయాన్ని పాలకులు గుర్తెరుగాలన్నారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమజీవులు రైతు కూలీలు చేతి వృత్తుల వారు ఉపాధి పనులకు లేదా ఇతర పనులకు వెళ్లిన వారు ఎండ వడదెబ్బలకు గురై ప్రతిరోజు పిట్టల్లా రాలి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన రైతు కూలీల కుటుంబాలకు రూ.25 లక్షలుఎక్స్ గ్రేషియో చెల్లించాలని,
అగ్ని ప్రమాదాలతో పంటలు దగ్ధమైన రైతులకు నష్టపరిహారం చెల్లింవి అన్ని విధాలా ఆదుకోవాలని వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.