ఆలయ అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలిఆలయ అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు, గుత్తేదారులకు సూచించారు.బుధవారం ఆలయ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గుత్తేదారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.అంతకుముందు బాలాలయంలో ప్రతిష్ఠించిన శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించిన అనంతరం అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మరో 50 రోజులలో అన్ని పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఫిబ్రవరి నెలలో జరగనున్న స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవం, జాతర బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు.అందుకు అనుగుణంగా పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు.దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో భూపాలపల్లి నియోజకవర్గంలోని కొడవటంచ ఆలయ పునఃఅభివృద్ధికి రూ.12.15 కోట్ల నిధులు కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు.ప్రస్తుతం ఆలయంలో విమాన గోపురం, అర్ధ మండపం, మహా మండపం, అద్దాల మండపం, ఆళ్వార్ నిలయం, పాకశాల, క్యూలైన్లు, అన్నదాన సత్రం, కాంపౌండ్ వాల్, తాగునీటి సదుపాయాలు తదితర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలని, అవసరమైన నిధులు, వసతులు సమకూర్చాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వాధికారులు, గుత్తేదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *