హిమంత్ బిస్వాశర్మను వెంటనే అరెస్టు చేయాలి!హిమంత్ బిస్వాశర్మను వెంటనే అరెస్టు చేయాలి!

ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్

ఎస్ఐఆర్ (ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియను ముస్లింలను వేధించడానికి వినియోగించుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి, బీజేపీ కార్యకర్తలకు, మీడియాకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పిలుపునివ్వడం అత్యంత హేయమైన చర్య అని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి విచ్చిన్నకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ దేశ ప్రజాస్వామ్య, లౌకిక విలువలను అవమానపరిచేలా మాట్లాడిన హిమంత బిస్వా శర్మను తక్షణమే అరెస్టు చేయాలని, ఆయనపై జాతీయ ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు.జాతీయ ఎన్నికల కమిషన్ వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఇప్పటికే అనేక అనుమానాలు, వివాదాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలను మరింత బలపరిచేలా ఉండటంతో పాటు, ఎన్నికల కమిషన్ పనితీరుపై కూడా సందేహాలు కలిగించేలా ఉన్నాయని అన్నారు.ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ ప్రక్రియను దుర్వినియోగం చేయాలని బహిరంగంగా పిలుపునివ్వడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై జాతీయ ఎన్నికల కమిషన్ వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని, హిమంత బిస్వా శర్మపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.మత సామరస్యాన్ని దెబ్బతీసేలా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేసిన ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరింది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *