ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి: సీపీఐ డిమాండ్ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి: సీపీఐ డిమాండ్

జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని అలియాబాద్ రెవెన్యూ శివారులో 10వ సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) డిమాండ్ చేసింది. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆ భూమిని సందర్శించినట్లు మండల కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు జువారి రమేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలోని అనేక గ్రామాలు, మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమించబడి, రెవెన్యూ అధికారుల అండదండలతో పట్టాలు చేసుకొని చెలామణి అవుతున్నాయని ఆరోపించారు. మండల కేంద్రానికి సమీపంలోని 10వ సర్వే నంబరులో ఉన్న భూమిని అధికారులు తక్షణమే సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు, ఇండ్ల స్థలం లేని వారికి భూమి కేటాయించి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకోవాలని కోరారు.ఇప్పటికీ అనేక మంది ఇండ్ల స్థలం లేని వారు ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్లు అందలేదని తెలిపారు.అలాగే ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్న జర్నలిస్టులకు కూడా ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే భూపోరాటాలకు దిగుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు ఎం.డి. యాకుబ్ పాషా, పార్టీ మండల కార్యవర్గ సభ్యులు వడ్లకొండ సుధాకర్, రడపాక సత్తయ్య, డిహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు కలకోట ప్రభాకర్, మహిళా సమాఖ్య మండల నాయకులు ఎం.డి. నూరున్నిసా, కుక్కల శోభ, వేల్పుల పెద్దరాములు, మాజీ సర్పంచ్ ఉప్పునుతుల మల్లయ్య, ఎల్మకంటి రవి, జువారి భద్రమ్మ, కొంతం రాజు, ఎం.డి. కుద్దూస్, నక్కా భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *