
రూ.2.07 లక్షల విలువైన బియ్యం,తూకం–కుట్టు మిషన్లు స్వాధీనం..ఇద్దరు అరెస్ట్
హన్మకొండ/హసన్‌పర్తి, సెప్టెంబర్ 8 (ఈ69న్యూస్)
హన్మకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవన్నపేట గ్రామంలో అక్రమంగా సేకరించి రీప్యాకింగ్ చేస్తున్న భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవన్నపేటలోని శ్రీ లక్ష్మి ప్రసన్న రైస్‌మిల్‌లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి, వాణిజ్య అవసరాల కోసం రీప్యాకింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హసన్‌పర్తి ఎస్‌ఐ ఎస్.రవి సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సమాచారం అందడంతో రైస్‌మిల్‌పై దాడి చేశారు.అక్కడ బియ్యం బస్తాలు నిల్వ చేసి ఉండగా, ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు పట్టుకుని విచారించగా పీడీఎస్ బియ్యం అక్రమ దందాకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.అరెస్టయిన వారిలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బొర్నపల్లి గ్రామానికి చెందిన కేశబోయిన మొగిలి, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలానికి చెందిన బెజ్జంకి శ్రీనివాస్ ఉన్నారు.పోలీసులు రైస్‌మిల్‌లో 64 బస్తాల్లో 50 కిలోల చొప్పున 32 క్వింటాళ్లు, 106 బస్తాల్లో సుమారు 25 కిలోల చొప్పున 24 క్వింటాళ్లు, మొత్తం సుమారు 56 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు రూ.1.96 లక్షలు కాగా, ఒక తూకం మిషన్, ఒక సంచులు కుట్టే మిషన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.2.07 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.విచారణలో నిందితులు మరికొందరితో కలిసి హసన్‌పర్తి మండలం, పరిసర ప్రాంతాల నుంచి ప్రభుత్వం సబ్సిడీపై అందించే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించేవారని పోలీసులు తెలిపారు. అనంతరం రైస్‌మిల్‌లో బియ్యాన్ని తూకం వేసి, కుట్టు మిషన్లతో “జై శ్రీరామ్” బ్రాండెడ్ సంచులతో పాటు ఇతర వాణిజ్య సంచుల్లో రీప్యాకింగ్ చేసి, దుకాణాల ద్వారా బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు.పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి, స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలకు పంచ్‌చిట్లు అమర్చారు.నిందితులను స్వాధీనం చేసుకున్న సొత్తుతో పాటు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.పేదల కోసం ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ ఏ.మహేందర్ హెచ్చరించారు.