
ఐటీడీఏలో అక్రమంగా పనిచేస్తున్న గిరిజనేతర డైలీ వేజ్ సిబ్బందిని తొలగించాలి
గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి – జై ఆదివాసి యువశక్తి సంఘం
ఈ69న్యూస్ ఏటూరునాగారం సెప్టెంబర్ 08:
జై ఆదివాసి యువశక్తి సంఘం ఆధ్వర్యంలో ఏటూరునాగారం ఐటీడీఏ ఆవరణలోని కొమురం భీం విగ్రహం వద్ద మీడియా సమక్షంలో జై ఆదివాసీ యువశక్తి సంఘం జిల్లా నాయకురాలు కొడిపే నయోమి మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాలో గిరిజనుల హక్కులు, గ్రామసభల అధికారాలను కాపాడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేసా నిబంధనల ప్రకారం షెడ్యూల్ ఏరియాలోని గ్రామసభలకు ఉన్న అధికారాలను గౌరవిస్తూ, గ్రామసభల తీర్మానాలు మరియు ఆమోదం మేరకు అర్హులైన గిరిజన కుటుంబాలకు ఇంటి నెంబర్లు కేటాయించేలా జిల్లా పంచాయతీ అధికారికి తక్షణమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. గ్రామసభల నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం ద్వారా గిరిజనుల హక్కులకు భంగం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో ఎటువంటి అధికారిక ఉత్తర్వులు, నియామక ప్రక్రియ లేకుండా గిరిజనేతర డైలీ వేజ్ సిబ్బంది పనిచేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న సిబ్బంది ఉంటే వారిని వెంటనే తొలగించి, వారి స్థానంలో అర్హత, నైపుణ్యం కలిగిన స్థానిక గిరిజన నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లోనే గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు, తాత్కాలిక ఉద్యోగాలు మరియు డైలీ వేజ్ అవకాశాల్లో స్థానిక గిరిజనులకు ప్రాధాన్యత కల్పించాలని నయోమి పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు, ఉపాధి అవకాశాలు, గ్రామసభల అధికారాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జై ఆదివాసి యువశక్తి సంఘం గౌరవ అధ్యక్షురాలు బడే సులోచన, చేలా సమంతక మణి, సోయం రత్న, కోరం వెంకటేశ్వర్లు, కుడుముల తేజవాణి, నాయకపోడ్ సంఘం అధ్యక్షులు బొల్లెం సారయ్య, తల్లడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
