పర్వతగిరి మండలం,భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నారంలోని పల్లవి ఆదర్శ పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా పాఠశాల ఆవరణలో విద్యార్థులందరితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం,వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పాటలు, నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షులు రాచకొండ అశోక్ చారి మాట్లాడుతూ…భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమానత్వం,న్యాయం,స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలను అందించిందని తెలిపారు. రాజ్యాంగం ప్రతి పౌరుడి హక్కులను కాపాడటంతో పాటు దేశ సమగ్రతను,ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. విద్యార్థులు చిన్నతనం నుంచే రాజ్యాంగ విలువలను తెలుసుకొని, క్రమశిక్షణతో పాటు పరస్పర గౌరవం, ఐక్యతను తమ జీవితాల్లో పాటించాలని సూచించారు.పాఠశాల ప్రతినిధి గంజి మహేందర్ మాట్లాడుతూ.రాజ్యాంగం మన దేశ పరిపాలనకు పునాది అని పేర్కొన్నారు.కుల,మత,భాష, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడం రాజ్యాంగ గొప్పతనమని వివరించారు.విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు విధులను కూడా బాధ్యతగా నిర్వర్తించాలని, ఇతరుల హక్కులను గౌరవిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.
పాఠశాల సంచాలకులు కోటగిరి రమేష్ మాట్లాడుతూ..రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సామాజిక బాధ్యత పెంపొందుతాయని తెలిపారు. పుస్తకాల్లో చదివిన విషయాలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆచరణాత్మకంగా తెలుసుకునే అవకాశం విద్యార్థులకు కలుగుతుందని అన్నారు.పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థిని అభినందిస్తూ,గెలుపోటములను పక్కనపెట్టి ఆసక్తితో పాల్గొనడమే ముఖ్యమని పేర్కొన్నారు.పాఠశాల ప్రధానాచార్యులు మేకల అశ్విని విద్యార్థులకు రాజ్యాంగ పీఠిక ప్రాముఖ్యతను వివరించారు. ప్రాథమిక హక్కులు,పౌరుల విధులు,ప్రజాస్వామ్య విలువలు, దేశ ఐక్యత వంటి అంశాలపై అవగాహన కల్పించారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ, సమాజం మరియు దేశం పట్ల తమ బాధ్యతలను కూడా విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సమన్వయకర్తలు రాజు,నవ్యశ్రీ, వకులాదేవి,సాంఘిక శాస్త్ర విభాగానికి చెందిన దేవేందర్, ఉపాధ్యాయులు మమత,హసీనా, ఉషారాణి,ఇతర ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పల్లవి పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం



