మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం లోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 14 నుండి 16 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దేవాలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.దేవాలయం,అన్నదాన సత్రం, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్ స్థలాలు, గోదావరి ఘాట్ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.ఫిబ్రవరి 15న సరస్వతి ఘాట్ వద్ద జరిగే తెప్పోత్సవం సందర్భంగా సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే రోజు ఉదయం 4 గంటల నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రధాన ఆలయంలో అదనపు సిబ్బందిని నియమించాలని దేవాలయ ఈఓకు సూచించారు.మహదేవ్‌పూర్, కాటారం, భూపాలపల్లి మార్గాల్లో ఇసుక వాహనాల రాకపోకలను ఉత్సవాల కాలంలో నిషేధించాలని తెలిపారు. పరిశుభ్రత, తాగునీరు, పారిశుధ్యంపై సమగ్ర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బస్ స్టాండ్ నుండి గోదావరి ఘాట్ల వరకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించడం, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, తాగునీటి సదుపాయాలు కల్పించడం, హ్యాండ్ పంపులు మరియు బోర్ వెల్స్ మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు.గోదావరి ఘాట్ల వద్ద తాత్కాలిక డ్రెస్సింగ్ రూములు ఏర్పాటు చేయడం, సరస్వతి ఘాట్ శుభ్రపరిచే పనులు పూర్తి చేయడం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు 104, 108 అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.ఆలయ ప్రాంగణంలో అగ్నిమాపక వాహనాన్ని స్టాండ్‌బైలో ఉంచాలని, నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని, తెప్పోత్సవం సందర్భంగా తాత్కాలిక విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
గోదావరి ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. వృద్ధులు, చిన్నారుల సౌకర్యార్థం తాత్కాలిక నీటి షవర్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణా, వసతి, అన్నదాన ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని ఆదేశించారు.కాళేశ్వరనికి అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని, హరిత విశ్రాంతి భవనంలో వీఐపీలకు వసతి మరియు భోజన సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.భక్తుల కోసం అన్నదానం, ప్రత్యేక ప్రసాదం కౌంటర్లు, అర్చన టిక్కెట్ల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయాలని దేవాలయ ఈఓను ఆదేశించారు. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి జగరణ సందర్భంగా హరికథ, బుర్రకథ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 14 నుండి 16 వరకు కాలేశ్వరం మరియు పరిసర ప్రాంతాల్లో వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు పూర్తి చేసి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *