
విద్యార్థులు వచ్చిన అవకాశాలను వినియోగించుకొని ఆకాశమే హద్దుగా ఎదగాలి : మండల విద్యాధికారి డాక్టర్ రామ్ధన్
ధర్మసాగర్ మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న మెరిట్ విద్యార్థుల కోసం ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, నారాయణగిరిలో జరిగింది.ప్రారంభ సమావేశంలో మండల విద్యాధికారి డాక్టర్ రామ్ధన్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పోటీ తత్వం రోజురోజుకు పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి వసతులు, ఉపాధ్యాయుల మెరుగైన బోధన అందుబాటులో ఉన్నందున విద్యార్థులు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆకాశమే హద్దుగా ఎదగాలని సూచించారు.ధర్మసాగర్ స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయుడు ధర్మ ప్రకాష్ రెగ్యులర్ తరగతుల్లో బోధనతో పాటు ఓరియంటేషన్ కార్యక్రమాల్లో నిపుణులు ఇచ్చే మెంటారింగ్ మధ్య ఉన్న తేడాలను వివరించారు. ధర్మసాగర్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళి మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలంటే క్రమశిక్షణ చాలా అవసరమని విద్యార్థులకు సూచించారు.ఉపాధ్యాయురాలు సుదిలా రాణి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయురాలు ఉమాదేవి, హిందీ ఉపాధ్యాయురాలు రాధిక, ఆంగ్లం ధర్మ ప్రకాష్, గణితం తులసి, భౌతిక శాస్త్రం వేణుగోపాల్, జీవశాస్త్రం శ్వేత, సాంఘిక శాస్త్రం నవీన్ కుమార్ విషయ నిపుణులుగా పాల్గొన్నారు. వారు తమ తమ సబ్జెక్టుల్లో ముఖ్యమైన కాన్సెప్టులను వివరించి, పబ్లిక్ పరీక్షల్లో గరిష్ట మార్కులు సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అలాగే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.