
ఈ 69న్యూస్ జనగామ:జనగామ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పనితీరు సరిగా లేదని, తక్షణమే ఆయనను బదిలీ చేయాలని జనగామ పట్టణ మూడవ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ఇంటింటి ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శనివారం ఉదయం 8 గంటలకు జనగామ పట్టణంలోని మూడవ వార్డులో ప్రారంభించేందుకు తన ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ను ఆహ్వానించేందుకు మధ్యాహ్నం సమయంలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినప్పటికీ ఆయన అందుబాటులో లేరని చెప్పారు.కలెక్టర్ ఆఫీస్ సూపరింటెండెంట్ ద్వారా కలెక్టర్ మహబూబాబాద్‌లో మంత్రి కార్యక్రమానికి వెళ్లారని తెలిసిందన్నారు.అనంతరం వాట్సాప్ ద్వారా రెండు సార్లు సందేశాలు పంపడంతో పాటు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ కలెక్టర్ స్పందించలేదని ఆరోపించారు.రాత్రి 7:40 గంటలకు క్యాంప్ కార్యాలయానికి వెళ్లినా కలెక్టర్ అందుబాటులో లేకపోవడం, ప్రజల సమస్యలపై వచ్చినప్పుడు సంప్రదించేందుకు అధికారులు లేకపోవడం బాధాకరమన్నారు.ప్రజాప్రతినిధులకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ఫోన్లు ఎత్తకపోవడం, సందేశాలకు స్పందించకపోవడం ప్రజల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.ప్రజలకు అందుబాటులో ఉండని కలెక్టర్ ఈ జిల్లాకు పనికిరాడని, వెంటనే ఆయనను ఈ జిల్లా నుంచి బదిలీ చేయాలని బూడిద జ్యోతి గోపి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.