
ఈ69 న్యూస్, ఖమ్మం పట్టణం, మార్చి 07:
గతంతో పోలిస్తే నేటి కాలంలో మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగం ఏదీ లేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇల్లు మాత్రమే కాకుండా సమాజాన్ని ముందుకు నడిపించే బాధ్యతను కూడా మహిళలే తమ భుజాలపై మోస్తున్నారని, అందుకే మహిళలే నిజమైన మహరాణులని అన్నారు.
ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం రఘునాథపాలెం మండల కేంద్రంలో నిర్మాణం కానున్న సేవాలాల్ మహరాజ్ ఆలయ ప్రాంగణంలో వీరనారీమణుల ఆశయసాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మహిళల ప్రాధాన్యత, సమాజంలో వారి పాత్ర, వారి ఔన్నత్యంపై ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సమితి గౌరవ సలహాదారు చిట్యాల స్వేత మాట్లాడుతూ సమాజంలో మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పుకుంటూనే అనేక సందర్భాల్లో అవమానాలు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ ద్వంద్వ ధోరణులను మహిళలు ఎదుర్కొని పోరాడాలని, అప్పుడు మాత్రమే విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు. మహిళలు తలుచుకుంటే అసాధ్యం ఏదీ లేదని, కుంగిపోకుండా ముందుకు సాగాలని సూచించారు. నేటి తరం మహిళలు చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
మిసెస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ ఎం.ఏ. ఫర్హా మాట్లాడుతూ మహిళలు సమాజంలో ముందుకు రావాలంటే విద్య ఎంతో కీలకమని చెప్పారు. వివక్షతను, ఆత్మన్యూనత భావాన్ని అధిగమించాలంటే జ్ఞానం అవసరమని, అందుకు విద్యాభ్యాసం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. అదే సమయంలో ఆరోగ్యం, ఆర్థిక భద్రతపైనా మహిళలు శ్రద్ధ పెట్టాలని సూచించారు.
సామాజిక ఉద్యమకారిణి విజయలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారని, గతంతో పోలిస్తే నేడు మహిళలు మహరాణులుగా ప్రభావశీలులుగా ఎదుగుతున్నారని అన్నారు. దీనికి ప్రధాన కారణం విద్యేనని పేర్కొంటూ ప్రతి ఒక్కరు చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ మాట్లాడుతూ నేటి కాలంలో అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని తెలిపారు. వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే మరింత మెరుగైన విజయాలు సాధిస్తారని అన్నారు. మహిళల పట్ల వివక్షత చూపకుండా సహకారం అందించాలని సూచించారు.
వీరనారీమణుల ఆశయసాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్రబాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ బాణోత్ భద్రు నాయక్, రఘునాథపాలెం సర్పంచ్ గాజుల క్రిష్ణ, గిరిజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ వీరన్న నాయక్ తదితరులు ప్రసంగించారు.
కార్యక్రమంలో భూక్యా జ్యోతి, కె.స్పందన, జాన్సీ, నాగమణి, సరోజిని, బాణోత్ ఉషా, వి.భద్రమ్మ, కవిత, లక్ష్మీ, సుభద్ర, రంగమ్మ, లక్ష్మీ నాయక్, బి.లక్ష్మీ, విజయ, షరీఫా బేగం, ప్రమీల, నద్యా నాయక్, బాలు నాయక్, సంజీవరావు, దాసరి శ్రీనివాస్, రవి నాయక్, లక్ష్మణ్ నాయక్, యాకేష్, శ్రీనివాస చారి, వీరన్న, డాక్టర్ రామకోటీ, నాగరాజు, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కళాకారులు పమ్మి రవి, ఫక్రుద్దీన్, కొమ్ము రాదా సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.