అధికారులు సమన్వయంతో పనిచేయాలి కడియం కావ్య
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్య, వైద్య, మహిళా శిశు సంక్షేమ, వ్యవసాయం, తాగునీరు, పారిశుద్ధ్యం, నీటిపారుదల, జాతీయ రహదారులు, ఆర్&బి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తదితర శాఖల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గించడంతో పాటు విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని, వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యే వరకు స్నాక్స్ అందించాలని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్స్ ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను గుర్తుచేశారు. పీఎం సూర్య ఘర్ సోలార్ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను సూచించారు.రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తక్కువగా ఉందన్నారు.బడిబాట కార్యక్రమం ద్వారా నమోదు పెంచాలని, ప్రతి పాఠశాలలో టాయిలెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. అలాగే పిల్లలకు టీకాలు వంద శాతం అందేలా వైద్యశాఖ చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, వరంగల్ చౌరస్తా ప్రాంతంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు.స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో 400కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి విద్యార్థుల నమోదు పెంచాలని సూచించారు.పాఠశాలల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, టాయిలెట్స్ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని తెలిపారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు పాఠశాలల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు హెల్త్ స్క్రీనింగ్ చేయాలని సూచించారు. హసన్పర్తి, బొల్లికుంట ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సమగ్ర కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.సమావేశం అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బాలికలకు ఇచ్చే హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం, అలాగే టీజీ రెడ్కో ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకానికి సంబంధించిన పోస్టర్లను ఎంపీ కడియం కావ్య, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు.ఈ సమావేశంలో మేయర్ సుధారాణి, జిల్లా అదనపు కలెక్టర్ రవి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.