
కాళ్లు మొక్కుతాం… ట్రాన్స్ఫార్మర్ ఫేజ్ వైరు వేయండి- స్పందించని లైన్ మెన్
తమ్మడపల్లి జి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ పేజ్ వైరు కోసం రైతుల ఆందోళన
ఈ 69న్యూస్ జఫర్ఘడ్, మార్చి 9:
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ఫేజ్ వైరు కాలిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా ట్రాన్స్ఫార్మర్ పనిచేయకపోవడంతో బోరు మోటార్లు నడవడం లేదు. దీంతో పంటలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ సిబ్బందికి, లైన్ మెన్‌కు సమాచారం ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఫేజ్ వైరు వేయాలని కాళ్లు మొక్కుతామని వేడుకున్నా కూడా లైన్ మెన్ పట్టించుకోలేదని వారు వాపోయారు.అంతేకాకుండా లైన్ మెన్ దురుసుగా ప్రవర్తిస్తూ, “ఫేజ్ వైరు వేస్తే నాకు ఏమి లాభం? మీకే పని చేయాలా? నాకు ఏడు గ్రామాల బాధ్యతలు ఉన్నాయి. నాకు కూడా కుటుంబం ఉంది, నేను ఎలా బతకాలి?” అంటూ మాట్లాడాడని రైతులు ఆరోపించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ కింద అక్రమ మోటార్లు ఉన్నాయని చెప్పి పనిని వాయిదా వేస్తున్నాడని కూడా పేర్కొన్నారు.సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు ట్రాన్స్ఫార్మర్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పంటలు ఎండిపోకుండా వెంటనే ఫేజ్ వైరు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.ఈ విషయంపై లైన్ మెన్‌ను వివరణ కోరగా, తాను ఏడు గ్రామాలకు ఒక్కడే బాధ్యతలు నిర్వహిస్తున్నానని తెలిపారు. తన పరిధిలో రెండు వేలకుపైగా మోటార్లు ఉన్నాయని, వాటిని ఒంటరిగా చూసుకోవడం చాలా కష్టంగా మారిందన్నారు.కొందరు రైతులు అనుమతులకు మించి మోటార్లు నడుపుతున్నారని, దాంతో వోల్టేజ్ సమస్యలు ఏర్పడి ఫేజ్ వైర్లు తరచూ కాలిపోతున్నాయని చెప్పారు. రైతులు అక్రమ కనెక్షన్లు తొలగించి సహకరించాలని ఆయన కోరారు.