
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి – ఏసీపీ రమేష్ కుమార్
తెలుగు గళం న్యూస్ హైదరాబాద్, మార్చి 13యువత సమాజ సేవలో ముందుండి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు.ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాల సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ట్రాఫిక్ సీఐ ఏడుకొండలు, కాచిగూడ సీఐ రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే గొప్ప సేవ చేయవచ్చని పేర్కొన్నారు. యువకులు, విద్యార్థులు రక్తదాన కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి, నిరుద్యోగం, విద్యా వ్యాపారీకరణ, మాదకద్రవ్యాల వ్యాప్తి వంటి సమస్యలపై యువత ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. ప్రశ్నించే యువతే సమాజ మార్పుకు మార్గం చూపుతుందని అన్నారు.దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, విద్యార్థులపై పెరుగుతున్న ఆర్థిక భారాలు, యువతను మాదకద్రవ్యాల బారిన పడేలా చేస్తున్న శక్తులను ఎదుర్కోవడం ప్రతి చైతన్యవంతమైన విద్యార్థి, యువకుడి బాధ్యత అని పేర్కొన్నారు. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భగత్ సింగ్ స్ఫూర్తితో మంచి భవిష్యత్తు కోసం పనిచేయాలని సూచించారు.డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, వెంకటేష్ మాట్లాడుతూ..ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో భగత్ సింగ్ యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థులు, యువత ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐపీఎం బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ మాధవి, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు అశోక్ రెడ్డి, లెనిన్, జావీద్, రాజయ్య, రజనీకాంత్, ప్రవీణ్, అర్జున్, ఆశ్వక్, మనోజ్, మదన్ తదితరులు పాల్గొన్నారు.