
సుజాతనగర్, మార్చి 13 (ఈ69న్యూస్):
సుజాతనగర్ మండల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ 21వ డివిజన్ కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి మండల వ్యవసాయ అధికారి నర్మదను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతుల భూములకు భూసార పరీక్షలు నిర్వహించడం, గ్రామాల వారీగా రైతు సదస్సులు ఏర్పాటు చేయడం, మండలంలో మొక్కజొన్న సేకరణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
అలాగే రబీ వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు, హామాలీలకు చలువ పందిళ్లు, చల్లని తాగునీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రైతుల ఖర్చులు తగ్గించేందుకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు సబ్సిడీపై అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన వ్యవసాయ అధికారి నర్మద రైతుల సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలపై కార్పొరేటర్ శ్రావణి చూపిన చొరవను మండల రైతులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు శరత్, ప్రనూష, నరసింహారావు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు నల్లగోపు పుల్లయ్య, వ్యాపారవేత్త చింతలపూడి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.