శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి ఆత్మహత్య
సిబ్బంది వేధింపులే కారణమా?
విద్యార్థి ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు?
పదవ తరగతి పరీక్షలకు ఒకరోజు ముందే ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పదో తరగతి పరీక్షలకు ఒక్కరోజు ముందు విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
లక్ష్మీదేవిపల్లి అశోక్‌నగర్‌కు చెందిన అప్పం నితీష్ (15) అనే విద్యార్థి అక్కడి శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ కుమారుడిని పాఠశాలలో ఒక బ్రాంచ్ నుండి మరో బ్రాంచ్‌కు మార్చడం వల్ల అతడు మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది ప్రవర్తన కూడా దీనికి కారణమై ఉండొచ్చని వారు అంటున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటి అనే విషయం విచారణలో తేలాల్సి ఉంది.
పరీక్షల ఒత్తిడి, విద్యాసంస్థల విధానాలపై మరోసారి చర్చ మొదలైంది.