తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్
తెలుగు గళం న్యూస్ జనగామ, ఏప్రిల్ 27
జనగామ మండలంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం అసహ్యకరమని తీవ్రంగా విమర్శించారు.గత నెల రోజులుగా జనగామలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా పనిచేయకపోవడంతో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.అప్పుల భారంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని పేర్కొన్నారు.రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, రవాణా సౌకర్యం కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, రైతుల ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోందని అన్నారు.వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించి, లారీలు మరియు అవసరమైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.అలాగే, మార్కెట్ యార్డులో ధాన్యం ఎండబోసుకున్న వివిధ గ్రామాల రైతుల ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని కోరారు. లేని పక్షంలో 100 మంది రైతులతో కలిసి 100 బస్తాల ధాన్యాన్ని జనగామ చౌరస్తాలో ఎండబెట్టి భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు.ఇంకా స్పందన లేకపోతే రోడ్ల దిగ్బంధం, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం మేల్కొనే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్యతో పాటు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.