చలివేంద్రం ఉందా.. చనిపోయిందా? ప్రయాణికుల దాహార్తి
చలివేంద్రం ఉందా.. చనిపోయిందా? ప్రయాణికుల దాహార్తి
ఎండలు మండుతున్న వేళ ప్రజల,ప్రయాణికుల దాహార్తి తీర్చడం కోసం రేగొండ మండల కేంద్రంలో పంచాయతీ ఆధ్వర్యంలో గ్రాండ్గా ప్రారంభించిన చలివేంద్రం ప్రస్తుతం నీరు లేక వెక్కిరిస్తోంది.స్థానిక సర్పంచ్,గ్రామ పాలకవర్గం ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం కేవలం ఒకటి రెండు రోజులకే పరిమితమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నీరు లేని కుండలు.. నిట్టూరుస్తున్న ప్రయాణికులు
మండల కేంద్రంలోని బస్టాండ్, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో ప్రస్తుతం చుక్క నీరు కూడా లేకపోవడం గమనార్హం.కుండలను పరిశీలించగా అవి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దాహంతో వచ్చే ప్రయాణికులు కుండలను చూసి నీరు ఉంటాయని ఆశగా వెళ్లడం, తీరా అవి ఖాళీగా ఉండటంతో నిరాశతో వెనుదిరగడం నిత్యకృత్యమైంది. మేజర్ గ్రామపంచాయతీ అయిన రేగొండలో ఇటువంటి దుస్థితి నెలకొనడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పేరుకే చలివేంద్రం.. పట్టించుకోని పాలకవర్గం
“ప్రారంభించినప్పుడు ఉన్న ఉత్సాహం తర్వాత నీటిని నింపడంలో కనిపించడం లేదు” అని పలువురు ప్రయాణికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కేవలం ఫొటోల కోసం,పబ్లిసిటీ కోసం తూతూ మంత్రంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి,ఆ తర్వాత గాలికొదిలేశారని ప్రజలు మండిపడుతున్నారు.కనీస నీటి సౌకర్యం కూడా లేని చోట చలివేంద్రం బోర్డు ఎందుకు ఉంచారని ప్రశ్నిస్తున్నారు.గ్రామ పాలకవర్గం ఇప్పటికైనా స్పందించి, ఎండల తీవ్రత దృష్ట్యా చలివేంద్రంలో నిత్యం తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని,ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని రేగొండ గ్రామస్తులు,ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.