ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్
ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి:జిల్లా కలెక్టర్
జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో సూచించారు.వేసవిలో వడదెబ్బ (హీట్ స్ట్రోక్) ప్రాణాంతకమని, ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రాణ రక్షణ పొందవచ్చని ఆయన తెలిపారు. ప్రత్యేకించి చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు,ఎండలో శ్రమించే కూలీలు అధిక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా ప్రతిరోజూ కనీసం 12 నుండి 15 గ్లాసుల నీరు తాగాలని, మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఎలక్ట్రోలైట్ ద్రావణాలు తీసుకోవడం మంచిదని సూచించారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కలెక్టర్ కోరారు.బయట పనిచేసే వారు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కనీసం ఐదు నిమిషాల పాటు నీడలో విశ్రాంతి తీసుకోవాలని,ప్రయాణాల్లో తప్పనిసరిగా తలకు టోపీ, కాటన్ గుడ్డ లేదా సన్ గ్లాసెస్ ధరించాలని తెలిపారు. ఆహార విషయంలో మితంగా తినాలని, కారం,మసాలాలు తగ్గించి పుచ్చకాయ, కీరదోస, తాటి ముంజలు వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు,కూరగాయలను తీసుకోవాలని సూచించారు.ఆల్కహాల్, సిగరెట్లు, కార్బొనేటెడ్ పానీయాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.జ్వరం, తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతులు, విరోచనాలు, అపస్మారక స్థితి వంటివి వడదెబ్బ లక్షణాలని, ఇవి కనిపిస్తే బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి తక్షణ వైద్య సహాయం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, ఆశా సబ్ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామని,వీటిని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రాహుల్ శర్మ కోరారు.