రెండు అడ్వాంటేజ్ టెక్నాలజీ సెంటర్లు
తెలుగు గళం న్యూస్ జనగాం, జూన్ 14
జనగాం, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలకు మంజూరైన రెండు అడ్వాంటేజ్ టెక్నాలజీ సెంటర్లు (ఎటిసిలు) యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో కీలకంగా మారనున్నాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన యువతకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు, స్వయం ఉపాధి దిశగా సొంత సంస్థలను స్థాపించుకునే అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి.ఈ నేపథ్యంలో జనగాం మండలం పసలమట్ల గ్రామంలో ఎటిసి నిర్మాణం కోసం కేటాయించిన రెండు ఎకరాల స్థలాన్ని రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు. స్థల సరిహద్దులపై చర్చించిన అనంతరం అధికారులు సర్వే నిర్వహించి హద్దులను ఖరారు చేశారు.తదుపరి ఆ స్థలాన్ని తెలంగాణ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిజిఐఐసి)కు అధికారికంగా అప్పగించారు. కేంద్ర నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు ప్రభుత్వం వెంటనే శంకుస్థాపన చేసి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కోరారు.ఈ కార్యక్రమంలో నాగరత్న సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బిర్రు ఇస్తారి, ఎటిసి ఇన్చార్జి ప్రిన్సిపాల్ రామానందం, రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.