నిరుద్యోగ సమస్యపై ఆగస్టు 20న మహాధర్నా – సీపీఎం

ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలనీ,
నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాదినేని రమేష్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.
తల్లాడలోని దొడ్డ కృష్ణయ్య భవన్‌లో సీపీఎం తల్లాడ మండల కమిటీ సమావేశం మండల కార్యదర్శి షేక్ మస్తాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మాదినేని రమేష్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ దేశానికి వెన్నెముకగా నిలిచే యువతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి, సంవత్సరాల తరబడి కష్టపడి చదువుతున్న యువత భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారని, అయితే ప్రభుత్వాలు వారి ఆశలను పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువత పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు.
సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు గడిచినా ఆ హామీని నెరవేర్చలేకపోయిందని అన్నారు. రాష్ట్రంలోని విద్య, వైద్య తదితర శాఖల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి, ఉద్యోగాలు లభించేంత వరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.5,000 నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు.
యువజన, ఉద్యోగ, ఉపాధి సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 20వ తేదీన ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న నిరుద్యోగ మహాధర్నాకు ఖమ్మం జిల్లాలోని యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు నల్లమోతు మోహన్‌రావు, పులి కృష్ణయ్య, కళ్యాణ కృష్ణయ్య, చల్ల నాగేశ్వరరావు, శీలం పకీరమ్మ, మన్నేపల్లి రామారావు, సత్తెనపల్లి నరేష్, రాజబోయిన సైదులు కట్ట దర్గయ్య ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
