E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ25 August, 2026E69NEWS

ఉర్సుగుట్ట ఘటనలో మరో వీడియో వైరల్..కలింగ బార్ వర్కర్లపై చర్యలు తీసుకోవాలి

వరంగల్, ఆగస్టు 25(ఈ69న్యూస్)

ఉర్సుగుట్ట ఘటనపై రోజుకో కొత్త వీడియో వెలుగులోకి వస్తుండటంతో అసలు ఏం జరిగిందన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.తాజాగా బయటకు వచ్చిన మరో వీడియోలో కానిస్టేబుల్ దాడికి పాల్పడినట్లు కనిపించడంతో పాటు, కలింగ బార్‌లో పనిచేసే కొందరు వర్కర్లు సైతం కర్రలతో దాడి చేస్తున్న దృశ్యాలు కనిపించడం కలకలం రేపుతోంది.దీంతో ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై సమగ్ర విచారణ జరిపి, తప్పు చేసిన కలింగ బార్ వర్కర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో ఒక వ్యక్తిపై పలువురు దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.ఇందులో కానిస్టేబుల్‌తో పాటు కలింగ బార్‌కు చెందిన కొందరు వర్కర్లు కూడా దాడిలో పాల్గొన్నట్లు కనిపించడం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. వీడియోలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, దాడికి పాల్పడినట్లు కనిపిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.మరోవైపు ఈ ఘటనలో దాడికి గురైన వ్యక్తిపైనే కేసులు నమోదు చేసినట్లు సమాచారం.అయితే వీడియోల్లో దాడి చేస్తున్నట్లు కనిపిస్తున్న కానిస్టేబుల్, కలింగ బార్ వర్కర్లపై కేసులు నమోదయ్యాయా? వారిని విచారించారా?వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల ముందున్నాయి. ఒకవేళ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు వాస్తవమే అయితే, దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై సమానంగా చట్టం అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.చట్టం అందరికీ సమానమేనన్న నమ్మకాన్ని పోలీసులు నిలబెట్టాలి. పోలీసు శాఖకు చెందిన వ్యక్తి దాడిలో పాల్గొన్నట్లు వీడియోలో కనిపిస్తే ఆ అంశంపైనా నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. అదే సమయంలో కలింగ బార్ వర్కర్లు దాడికి పాల్పడినట్లు ఆధారాలు లభిస్తే వారిపైనా ఎలాంటి మినహాయింపులు లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.సీసీ కెమెరా ఫుటేజీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు పూర్తిస్థాయిలో పరిశీలించి ఘటనకు ముందు, ఘటన సమయంలో జరిగిన పరిణామాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఒక వ్యక్తిపై మాత్రమే కేసులు నమోదు చేసి, ఇతరుల పాత్రను విస్మరిస్తే దర్యాప్తుపై అనుమానాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా చట్టం ముందు సమానమే. వీడియోల్లో దాడికి పాల్పడినట్లు కనిపిస్తున్న కలింగ బార్ వర్కర్లపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కానిస్టేబుల్ పాత్రపైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరుతున్నారు.ఇదిలా ఉండగా, ఉర్సుగుట్ట ఘటనకు సంబంధించి నమోదైన కేసులు, వీడియోల్లో కనిపిస్తున్న వ్యక్తుల పాత్ర, కానిస్టేబుల్‌తో పాటు కలింగ బార్ వర్కర్లపై తీసుకున్న చర్యలపై పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తాజాగా మరో వీడియో బయటకు రావడంతో ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *