దేవాదుల పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి
ఈ69న్యూస్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 25
దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలోని ఈఎన్‌సీ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)తో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా పరిగణించి అవసరమైన నిధులు విడుదల చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.దేవాదుల ఎత్తిపోతల పథకంలోని గండి రామారం ఎడమ కాలువ నిర్మాణానికి భూసేకరణ పూర్తయినప్పటికీ పనులు ఇంకా ప్రారంభం కాలేదని ఆయన పేర్కొన్నారు. తక్షణమే పనులు ప్రారంభించి ఆయా ప్రాంతాల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.గండి రామారం ఎత్తిపోతల పథకంలో భాగమైన లిఫ్ట్-1, లిఫ్ట్-3 పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ వరకు నిర్మించిన టన్నెల్‌ను 15 రోజుల్లో వినియోగంలోకి తీసుకువచ్చి ఘనపూర్ రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించాలని కడియం శ్రీహరి కోరారు.దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3లోని తొమ్మిది మోటార్ల ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోసే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి దేవాదుల కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే నెల్లూట్ల సమీపంలోని ఏశ్వంతపూర్ వాగుపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి, అవసరమైన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలోని పెండింగ్ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు, గుత్తేదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు పనులకు అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.