అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి:అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నీట్ (2026) పరీక్షను జిల్లాలో ప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదేశించారు.సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో పోలీస్, విద్యా, రవాణా, వైద్య, అగ్నిమాపక శాఖల అధికారులతో ఆయన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో మొత్తం 374 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని,ప్రశ్నపత్రాలను పోలీస్ భద్రత మధ్య తరలించాలని పోలీసు శాఖను ఆదేశించారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు పరీక్ష రోజున మూసివేయాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని, విద్యుత్ శాఖ అంతరాయం లేకుండా సరఫరా అందించాలని, మున్సిపల్ శాఖ తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద అంబులెన్స్, ప్రథమ చికిత్స మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్య శాఖను, అత్యవసర సేవల కోసం అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేయాలని ఫైర్ డిపార్ట్మెంట్ను సూచించారు. అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 11 గంటల నుండే అనుమతిస్తారని,నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమతో పాటు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను తప్పనిసరిగా తెచ్చుకోవాలని కోరారు. జిల్లాలో నీట్ పరీక్షలను ఎటువంటి అంతరాయం లేకుండా విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎస్పీ సంపత్ రావు, రవాణా అధికారి సంధాని, డీఈఓ రాజేందర్, నోడల్ అధికారి డాక్టర్ రమణా రావు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.