నూతన ఆసుపత్రి ప్రారంభం.. డ్రైనేజీ పనుల పరిశీలన
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తెలిపారు. బుధవారం సత్తుపల్లి మున్సిపాలిటీ 18వ వార్డులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.
ముందుగా యూపీఎస్ స్కూల్ రోడ్డులో డాక్టర్ సురేష్ రామాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన “న్యూ స్టార్ హాస్పిటల్” ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ సురేష్ రామాల దంపతులను అభినందించారు. ఆరోగ్య రంగంలో ఇటువంటి సేవా సంస్థలు ఏర్పడడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.