పాఠశాల ప్రహరీ కూలిపోయి రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు!
ప్రహరీ లేక పశువులు, కుక్కల సంచారం.. బాలికల హాస్టల్ భద్రతపై ఆందోళన
విద్యార్థినుల రక్షణకు వెంటనే ప్రహరీ నిర్మించాలి – అధికారులు తక్షణమే స్పందించాలి
ఏటూరునాగారం మండలం, ఆకులవారి ఘణపురం తాళ్లగడ్డలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో వర్షాలకు ప్రహరీ గోడ కూలిపోవడంతో విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రహరీ కూలిపోవడంతో బాలికల హాస్టల్కు రక్షణ లేకుండా పోయిందని విద్యార్థులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రహరీ గోడ కూలిన ప్రాంతం నుంచి పశువులు, కుక్కలు హాస్టల్ ఆవరణలోకి చొరబడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో బాలికలకు అసౌకర్యంతో పాటు భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలికల హాస్టల్ పరిసరాల్లో రక్షణ ఏర్పాట్లు అత్యంత కీలకమైనప్పటికీ, ప్రహరీ గోడ కూలిపోయిన విషయంపై సంబంధిత నిర్వాహకులు, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకముందే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, కూలిపోయిన ప్రహరీని పరిశీలించి, నాణ్యతతో కూడిన కొత్త ప్రహరీ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున అధికారులు ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి వెంటనే ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టి బాలికల హాస్టల్కు పూర్తి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.