

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్, మే 2
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం భాగంగా నిర్వహించిన సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశం పట్టణంలోని సిరిపురం గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. గ్రామాల స్థాయిలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించే మంచి అవకాశంగా ఇది మారిందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. అవి రైతు సంక్షేమం, మహిళా సాధికారత, పేద వర్గాల అభివృద్ధి అని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, ధాన్యానికి మద్దతు ధర వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.మహిళల అభివృద్ధి కోసం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీ లేని రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు.మహిళలను ఆర్థికంగా బలంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.పేద వర్గాల సంక్షేమం కోసం కొత్తగా “ఇందిరా కుటుంబ భీమా” పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కుటుంబ పెద్ద మరణించిన పక్షంలో 15 రోజుల్లో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు.అదనంగా 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నామని, ముఖ్యంగా వితంతు మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.నియోజకవర్గ అభివృద్ధి విషయానికొస్తే, దేవాదుల కాలువల మరమ్మతులకు రూ.350 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో వరి, మొక్కజొన్న దిగుబడులు పెరిగాయని చెప్పారు. అలాగే 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు కొనసాగుతున్నాయని వివరించారు.ప్రతి గ్రామంలో ఏదో ఒక అభివృద్ధి పని జరుగుతోందని, ప్రజల స్వంత ఇల్లు కలను ప్రభుత్వం నెరవేర్చుతోందన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాలని సూచించారు.తాను 32 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, నీతి, నిజాయితీతో పనిచేయడం వల్లే ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు తెచ్చే బాధ్యత తనదైతే, వాటిని సమర్థంగా అమలు చేయడం స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత అని స్పష్టం చేశారు.ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారంతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.