ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.పోలీసులు నిర్వహించిన మెరుపు దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి సుమారు ఒక లక్ష రూపాయల విలువైన 2.310 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విజయవంతమైన ఆపరేషన్లో కొత్తపల్లిగోరి ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి కీలక పాత్ర పోషించి నిందితులను పట్టుకోవడంలో ధైర్యసాహసాలను ప్రదర్శించారు.
ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చాకచక్యంగా తనిఖీలు
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి నిర్మూలనకు చేపట్టిన చర్యల్లో భాగంగా, కొత్తపల్లిగోరి ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డికి అందిన విశ్వసనీయ సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.ఎస్సై తన పోలీసు బృందంతో కలిసి జెంషెడ్ బేగ్ పేట బ్రిడ్జ్ సమీపంలో అత్యంత అప్రమత్తంగా వాహన తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో రేగొండ వైపు నుండి నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్పై అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను గమనించి ఒక్కసారిగా వెనుదిరిగి పారిపోవడానికి ప్రయత్నించారు.అయితే ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సిబ్బందితో కలిసి నిందితులను చాకచక్యంగా వెంటాడి, వారు తప్పించుకోకుండా బంధించి అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్లను సోదించగా 2.310 కిలోల గంజాయి బయటపడింది.
తల్లిదండ్రులు పిల్లలపై కన్నేసి ఉంచాలి:సిఐ కరుణాకర్ రావు
కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణపురం సర్కిల్ సిఐ కరుణాకర్ రావు వివరాలు వెల్లడించారు.అరెస్టయిన వారిలో బైరగాని గణేష్ (16), పాయం వర్షిత్ (17), బీస ప్రవీణ్ (23) ఉన్నారని తెలిపారు. నిందితులు ఒరిస్సాలోని మల్కాన్గిరి సరిహద్దుల నుండి గంజాయి తీసుకువచ్చి ఇక్కడ విక్రయించాలని ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఏం పనులు చేస్తున్నారు అనే అంశాలపై కచ్చితమైన అవగాహన కలిగి ఉండాలని, వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
జిల్లాలో ‘ఈగల్ టీమ్స్’ అప్రమత్తం
జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రత్యేకంగా ‘ఈగల్ టీమ్స్’ను సిద్ధం చేశారని సిఐ తెలిపారు.జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ బృందాలు సంచరిస్తూ గంజాయి సాగు,రవాణాపై క్షుణ్ణంగా నిఘా ఉంచుతున్నాయని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల జోలికి ఎవరు వచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాణాలకు తెగించి నిందితులను పట్టుకున్న ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డిని పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గోరి ఎస్సై 2 షా ఖాన్,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్స్ కృష్ణ,హరీష్,స్వామి తదితరులు పాల్గొన్నారు.