E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ2 July, 2026E69NEWS

లైంగిక దాడుల బాధితులకు సకాలంలో న్యాయం అందించడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: వరంగల్ సీపీ ఎన్. శ్వేత

వరంగల్: లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు చట్టబద్ధమైన రక్షణతో పాటు వైద్య, న్యాయ, మానసిక పరామర్శ, పునరావాస సేవలను సకాలంలో అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ అన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, జనగామ జిల్లాల్లో భరోసా కేంద్రం ద్వారా అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ ఎన్. శ్వేత మాట్లాడుతూ, లైంగిక దాడుల బాధితుల గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రతి కేసును అత్యంత సున్నితంగా విచారిస్తూ, కేసు నమోదు నుంచి దర్యాప్తు, వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాసం వరకు అన్ని దశల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా పోక్సో (POCSO) చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిర్దేశిత గడువులోపు దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు అవసరమైన వైద్య సేవలు, మానసిక పరామర్శ, న్యాయ సహాయం ఒకే వేదికపై అందుబాటులో ఉండేలా భరోసా కేంద్రం సేవలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు వేగవంతమైన, సమగ్ర సేవలు అందించడంలో అన్ని శాఖలు సమిష్టిగా పనిచేస్తేనే సకాలంలో న్యాయం అందించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత స్పష్టం చేశారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *