
వక్ఫ్-ఎ-నౌ ఇజ్తిమాలో అహ్మదీయ ఖలీఫా పిలుపు
ఈ68 న్యూస్ యుకే, మే02
అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రపంచ అధినేత మిర్జా మస్రూర్ అహ్మద్ విజ్ఞానం మరియు మతం పరస్పర విరుద్ధాలు కావని, రెండూ కలిసే నడుస్తాయని స్పష్టం చేశారు. యుకేలో నిర్వహించిన నేషనల్ వక్ఫ్-ఎ-నౌ ఇజ్తిమా 2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.టిల్ఫోర్డ్లోని మస్రూర్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి యుకే నలుమూలల నుండి 2,100 మందికి పైగా యువకులు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఎంటిఎ ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు.ప్రసంగంలో మిర్జా మస్రూర్ అహ్మద్ వక్ఫ్-ఎ-నౌ సభ్యుల బాధ్యతలను వివరించారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ఇస్లాం సేవకు అంకితం చేసే ఈ పథకంలో చేరినవారు పెద్దయ్యాక స్వచ్ఛందంగా కొనసాగాలా లేదా తప్పుకోవాలా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందన్నారు.యువత అత్యున్నత నైతిక విలువలు పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు.తక్వా (ధర్మబద్ధ జీవనం) ప్రతి చర్యలో ప్రతిఫలించాలన్నారు.మాటలు, పనులు ఒకేలా ఉండాలని, కపటత్వానికి తావు ఉండకూడదని హెచ్చరించారు.సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావంతో యువత దారి తప్పే ప్రమాదం ఉందని పేర్కొంటూ, స్వీయ నియంత్రణ అవసరమని అన్నారు.విజ్ఞానాన్ని ఉపయోగించి దేవుని ఉనికిని నిరూపించాల్సిన బాధ్యత ముస్లింలపై ఉందని ఆయన పేర్కొన్నారు. “నాస్తికులు శాస్త్రాన్ని దేవుని నిరాకరణకు ఉపయోగిస్తే, మీరు దాన్ని దేవుని సత్యాన్ని నిరూపించడానికి వినియోగించాలి” అని పిలుపునిచ్చారు.శాస్త్రాల్లో ప్రతిభ కనబరచి ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలుగా ఎదగాలని యువతకు సూచించారు.అహ్మదీయ సమాజానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ సలాం ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.ప్రతిరోజూ నమాజ్ చేయడం, ఖురాన్‌ను అర్థం చేసుకుని ఆచరించడం విజయానికి మార్గమని ఆయన వివరించారు.కుటుంబంలో ప్రేమాభిమానాలు పెంపొందించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన ప్రతి సభ్యుడు సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగాలని ప్రార్థించారు.