విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి
మహబూబాబాద్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ పి.రత్నకుమారి తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ బాలురు కళాశాలలో ఘనంగా ఫేర్ వెల్ డే వేడుకలు
ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలంటే సాధించాలనే తపన, సరైన లక్ష్యం, పట్టుదలతో ముందుకు సాగాలని జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ పి.రత్నకుమారి అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ శివారులోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ బాలురు కళాశాలలో ఫేర్ వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రీజినల్ కో ఆర్డినేటర్ పి.రత్నకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థులకు మొదటి,ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఫేర్ వెల్ పార్టీ ఇచ్చిన సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలు పంచుకున్నారు. అనంతరం ఆర్ సిఓ
రత్న కుమారి మాట్లాడుతూ ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పరచుకుని,లక్ష్యాల సాధన కోసం ఇష్టపూర్వకంగా పనిచేస్తూ ముందుకు సాగినప్పుడు జీవితాంతం సంతోషకరంగా జీవన ప్రయాణం కొనసాగుతుందని సూచించారు.ప్రస్తుత పోటి ప్రపంచంలో ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు.విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.కళాశాలలో ఉండే అన్ని వసతులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్లకు సూచించారు.విద్యార్థులు పాటలు,డాన్స్ ప్రదర్శనలతో అలరించారు.పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులను అభినందించి మెడల్స్,సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఉమా రాణి,వైస్ ప్రిన్సిపాల్ విజయశాంతి,అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.