సామాజిక విప్లవ జ్యోతులు పూలే – అంబేద్కర్
భారతదేశంలో దశాబ్దాలుగా నాటుకుపోయిన అస్పృశ్యత, అంటరానితనం, సామాజిక దోపిడీ వంటి అసమానతలపై అక్షర యుద్ధం చేసిన జ్ఞానజ్యోతులు మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. అబ్బాస్ కొనియాడారు.
మహానీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన “పూలే–అంబేద్కర్ జనజాతర” సభ కొండేటి శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పూలే, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రధాన వక్తగా పాల్గొన్న ఎం.డి. అబ్బాస్ మాట్లాడుతూ, పూలే మరియు అంబేద్కర్ భారతీయ సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం స్థాపనకు శాస్త్రీయ దృక్పథంతో నిరంతరం పోరాడిన మహనీయులు అన్నారు. పూలే విద్యను సామాజిక విముక్తి సాధనంగా భావించి అణగారిన వర్గాల సాధికారతకు పునాది వేయగా, అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని సంస్థాగతంగా స్థాపించారన్నారు. ఈ ఇద్దరి ఆలోచనల్లో మానవతావాదం, కులవివక్ష వ్యతిరేక సిద్ధాంతం కీలక స్థానాన్ని పొందాయని తెలిపారు. పూలే సామాజిక సంస్కరణలను ప్రజల్లో చైతన్యంతో ముందుకు తీసుకెళ్లగా, అంబేద్కర్ చట్టబద్ధ మార్గాల ద్వారా హక్కులను స్థిరపరిచారని పేర్కొన్నారు.
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య మాట్లాడుతూ, అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పూలే, అంబేద్కర్ అక్షరాలను ఆయుధంగా ఎంచుకుని పోరాడారని అన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి హామీ ఇచ్చిన మౌలిక హక్కులు సామాజిక విప్లవానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ముఖ్యంగా సమానత్వ హక్కు, వివక్షత నిషేధం, ఉద్యోగాలలో సమాన అవకాశాలు, అణచివేతకు వ్యతిరేక రక్షణలు సామాజిక న్యాయం సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడం ద్వారా మాత్రమే సమాన సమాజ నిర్మాణం సాధ్యమని పిలుపునిచ్చారు.
ప్రముఖ న్యాయవాది దర్శనం నరసింహ మాట్లాడుతూ, పూలే–అంబేద్కర్ ప్రతిపాదించిన మానవ గౌరవం, సమానత్వ దృక్పథం భారత సమాజానికి శాశ్వత మార్గదర్శకమని అన్నారు. ప్రతి మనిషి పుట్టుకతోనే సమాన హక్కులు, గౌరవం కలిగి ఉండాలని వారు స్పష్టం చేశారని పేర్కొన్నారు. కులాధారిత అసమానతలను నిర్మూలించడం సమాజ అభివృద్ధికి అత్యవసరమని తెలిపారు.
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, భూహక్కులు, ఇళ్ల స్థలాలు, స్మశాన వాటికల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు. కులాంతర వివాహితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, వారికి రక్షణ కల్పించే ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, కళాకారులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.