
తల్లి పేరుతో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి
హనుమకొండ, జూన్ 22 (e69 న్యూస్):
పర్యావరణ పరిరక్షణతో పాటు తల్లి పట్ల ప్రేమ, గౌరవాన్ని చాటే లక్ష్యంతో కేంద్ర అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమ పోస్టర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాల్సిన అవసరం ఉందన్నారు. తల్లి పేరుతో ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించడం ద్వారా సమాజానికి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.
విద్యాశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమంలో ఒకటో తరగతి విద్యార్థుల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు వరకు అందరూ పాల్గొనవచ్చు. తల్లి పేరుతో నాటిన మొక్కతో సెల్ఫీ తీసుకుని సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేస్తే డిజిటల్ సర్టిఫికెట్ అందజేయబడుతుందని వెల్లడించారు.
జిల్లాలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ రవి, డీఆర్వో శ్రీనివాస్, డీఈవో గిరిరాజ్ గౌడ్, జిల్లా నేషనల్ గ్రీన్ కార్ప్స్ కోఆర్డినేటర్ ఎస్. శ్రీనివాస స్వామి, క్వాలిటీ కోఆర్డినేటర్ మన్మోహన్, ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.