





ఈ69న్యూస్ జనగామ మే03
జనగాం–హుస్నాబాద్ ప్రధాన రహదారిపై హనుమంతపూర్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తక్షణమే లారీలు పంపాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకోవడంతో ధర్నా విరమించారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ మాట్లాడుతూ హనుమంతపూర్ ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 300కు పైగా రైతులు తమ ధాన్యాన్ని ఎండబెట్టి సిద్ధంగా ఉంచినా, అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గన్ని బ్యాగుల కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 300 మంది రైతులు ఉన్నప్పటికీ కేవలం 3000 బ్యాగులు మాత్రమే ఇచ్చి అధికారులు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు.అలాగే దాదాపు 150 లారీలకు సరిపడ ధాన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు 10 శాతం కూడా కొనుగోలు చేయలేదని తెలిపారు.మరోవైపు లారీ కాంట్రాక్టర్ ఫోన్ ఎత్తకపోవడం, జిల్లా కలెక్టర్ సహా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందన్నారు.వాతావరణ శాఖ మే 20 నాటికి నైరుతి రుతుపవనాలు ప్రారంభమై వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతులు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని అన్నారు. పరిస్థితి మరింత దిగజారితే రైతులు ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.కాబట్టి ప్రతి కొనుగోలు కేంద్రానికి రోజువారీగా లారీలు పంపేలా చర్యలు తీసుకోవాలని, గన్ని బ్యాగుల కొరత లేకుండా ముందుగానే సరిపడా బ్యాగులు అందించాలని, పీఏసీఎస్ సహకార సంఘాలకు కొత్త బ్యాగులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో నిరవధిక ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు, హనుమంతపూర్ మాజీ సర్పంచ్ ఇరుగు కృష్ణమూర్తి తదితరులు, రైతులు పాల్గొన్నారు.