ప్రభుత్వం-ప్రజల మధ్య వారధిగా మీడియా పాత్ర కీలకం
స్వీయ నమోదు ద్వారా ఖచ్చితమైన సమాచారం – ప్రజలు చురుకుగా పాల్గొనాలి
సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు
ప్రభుత్వం-ప్రజల మధ్య వారధిగా మీడియా పాత్ర కీలకం
ఖమ్మం,ఏప్రియల్27(తెలుగు గళం)న్యూస్ :
జిల్లాలో జన గణనను డిజిటల్ విధానంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తెలిపారు.సోమవారం జిల్లా కలెక్టరెట్ లో జనగణన పై కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ మాట్లాడుతూ 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన తాను భూపాలపల్లి, జగిత్యాల, ములుగు జిల్లాల్లో పనిచేసి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు.* జిల్లాలో ప్రతి ప్రభుత్వ పథకం అర్హులైన వారికి పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ముఖ్యంగా స్వీయ నమోదు (Self Enumeration) ద్వారా ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని ప్రజలను కోరారు. జన గణన రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశ హౌస్ లిస్టింగ్ లో స్వీయ గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 2,651 హౌస్ లిస్టింగ్ బ్లాకులు గుర్తించామని, ప్రతి బ్లాక్‌లో సుమారు 300 ఇళ్లు, 800 జనాభా ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియ కోసం 2,669 మంది ఎన్యుమరేటర్లు, 485 మంది సూపర్వైజర్లను (రిజర్వ్‌తో సహా) నియమించామని తెలిపారు.
స్వీయ నమోదు కోసం se.census.gov.in పోర్టల్‌లో కుటుంబంలోని ఒక సభ్యుడు లాగిన్ అయి వివరాలు నమోదు చేయవచ్చని తెలిపారు. నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని, ఒకసారి నమోదు చేసిన తరువాత సవరణకు అవకాశం ఉండదని సూచించారు. నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు 11 అంకెల సంఖ్య వస్తుందని, ఆ సంఖ్యను ఎన్యుమరేటర్‌కు అందజేయాలని తెలిపారు. ఏవైనా తప్పులు ఉంటే ఎన్యుమరేటర్ ద్వారా మాత్రమే సవరించుకోవచ్చని స్పష్టం చేశారు. డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ జనగణనలో డేటా గోప్యతకు పూర్తి భద్రత ఉంటుందని, స్వీయ నమోదు ద్వారా వేగవంతంగా, ఖచ్చితమైన డేటా సేకరణ సాధ్యమవుతుందని చెప్పారు. జన గణన 2027 కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, స్వీయ నమోదు చివరి తేదీ మే 10 అని తెలిపారు. సాధారణంగా నివసించే ప్రదేశంలోనే ప్రజలు నమోదు కావాలని సూచించారు.
ఈ రోజు ఉదయం ఉప ముఖ్యమంత్రి స్వీయ నమోదు పూర్తి చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం, ప్రజల మధ్య మీడియా వారధిగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
వేసవి చర్యల ప్రణాళిక అమలు గురించి మాట్లాడుతూ, జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల కోసం ప్రధాన ప్రాంతాల్లో తాగునీరు, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, వేడి ప్రభావం తగ్గించేందుకు అవసరమైన సూచనలు ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు.
ఆరోగ్యం, విద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఫీల్డ్ స్థాయి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఈ రోజు 110 లోడ్లు జిల్లాకు చేరాయని తెలిపారు. సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, లాజిస్టిక్ సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు.ఈ మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, సీపీఓ, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.