నక్షలో దారి లేదంటున్నారు..మరి ఏ నక్షతో పనులు మంజూరు చేశారు?

ప్రతి రూపాయికీ లెక్క చెప్పాలి.. కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలి
ఈ69న్యూస్ వరంగల్/చెన్నారావుపేట, సెప్టెంబర్ 2
చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం–మాధవ్‌నగర్ నుంచి తిమ్మాపేట–శాంతినగర్ వరకు ఉన్న వ్యవసాయ దారి వ్యవహారంలో 100 రోజుల ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కాట కుమారస్వామి డిమాండ్ చేశారు.ప్రస్తుతం లొకేషన్ మ్యాప్‌లో దారి కనిపించడం లేదని అధికారులు చెబుతున్న నేపథ్యంలో, అదే మార్గంలో గతంలో ఉపాధి హామీ పనులు ఏ ఆధారాలతో మంజూరు చేశారని ఆయన ప్రశ్నించారు. పనులకు ఎవరు అనుమతులు ఇచ్చారు? ఎంతమంది కూలీలు పని చేశారు? ఎన్ని పని రోజులు నమోదయ్యాయి? ఎంత మొత్తం కూలీలకు చెల్లించారు? మొత్తం ఎంత ప్రభుత్వ నిధులు ఖర్చయ్యాయి? అనే వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు.లెక్కలు బయటకు రావాల్సిందే!
100 రోజుల ఉపాధి హామీ పనులకు సంబంధించిన పని అంచనా, పరిపాలనా అనుమతి, సాంకేతిక అనుమతి, పని కోడ్, నక్ష, హాజరు పట్టికలు, కూలీల చెల్లింపులు, మొత్తం ఖర్చులు, సర్వే నంబర్లు తదితర రికార్డులను అధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని కాట కుమారస్వామి అన్నారు.రైతులు, ప్రజలు ఈ వ్యవసాయ దారి సమస్యపై కొంతకాలంగా అధికారులను కలిసి పరిష్కారం కోరుతున్నారని తెలిపారు. ఈ అంశం ఇప్పటికే జిల్లా పరిషత్ వరంగల్ అధికారులు, చెన్నారావుపేట ఎంపీడీవో కార్యాలయం దృష్టికి వెళ్లిందని పేర్కొన్నారు.
“నక్షలో లేదు” అంటే.. పనులు ఎలా జరిగాయి?
దారి ప్రభుత్వ రికార్డుల్లో లేదంటే గతంలో అదే మార్గంలో ప్రభుత్వ పథకం కింద పనులు ఎలా మంజూరయ్యాయో అధికారులు స్పష్టం చేయాలని కాట కుమారస్వామి ప్రశ్నించారు.
దారి ప్రభుత్వానికి చెందినదైతే ప్రస్తుతం “నక్షలో దారి లేదు” అని ఎందుకు చెబుతున్నారు?
ప్రైవేటు దారి అయితే ప్రభుత్వ నిధులతో పనులు ఎందుకు చేపట్టారు?
ప్రభుత్వ దారి అయితే దానికి సంబంధించిన రికార్డులు ఎందుకు కనిపించడం లేదు?
అనే అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజాధనంతో చేపట్టిన ప్రతి పనికి పూర్తి లెక్క ఉండాల్సిందేనని, ప్రభుత్వ నిధుల వినియోగంపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పనుల మంజూరు నుంచి నిధుల ఖర్చు వరకు ప్రతి దశను రికార్డుల ఆధారంగా పరిశీలించాలని కోరారు.ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా విచారణకు ఆదేశించి, 100 రోజుల పనుల మంజూరు, పనుల నిర్వహణ, కూలీల హాజరు, చెల్లింపులు, నిధుల ఖర్చు, సర్వే నంబర్ల వివరాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కాట కుమారస్వామి డిమాండ్ చేశారు.