పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేసి పీఆర్సీ ప్రకటించాలి
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తాం
జీవో–25 సవరణ నుంచి సీపీఎస్ రద్దు వరకు అన్ని హామీలను వెంటనే అమలు చేయాలి – ప్రభుత్వానికి యూఎస్పీసీ డిమాండ్
ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేసి, నూతన పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని యూఎస్పీసీ (ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ) నాయకులు పోడెం సమ్మయ్య, పల్లె నాగరాజు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. తమ న్యాయమైన హక్కులను సాధించుకునే క్రమంలో శుక్రవారం ఏటూరునాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలు కేవలం ఉద్యోగుల సమస్యలు కావని, రాష్ట్ర విద్యా వ్యవస్థ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రజా సమస్యలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించడం వల్ల విద్యారంగం తీవ్రంగా నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ డీఏలు విడుదల చేసి పీఆర్సీ ప్రకటించడం, ప్రాథమిక విద్యకు నష్టదాయకంగా మారిన జీవో–25ను సవరించడం, టెట్‌లో సర్వీస్ వెయిటేజ్ కల్పించడం, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, మెమో–57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయడం, కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయడం, అలాగే హెల్త్ కార్డులను పూర్తిస్థాయిలో అమలు చేయడం వంటి డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం ఇకపై ఆలస్యం చేయకుండా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూఎస్పీసీ నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు సీహెచ్.సుమన్, ఎస్.శ్రవణ్ కుమార్, కె.రాజన్న, బి.సూర్య, బి.రాజు, శోభ, రజిత, మాధవి, రజని, పద్మశ్రీ, రమాదేవి తదితరులు పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.