చిన్నకోడెపాకలో అక్రమ పట్టాల రద్దుకు ధర్నా
పేదల భూములపై అక్రమార్కుల కన్ను:చిన్నకోడెపాకలో అక్రమ పట్టాల రద్దుకు ధర్నా
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలోని చిన్నకోడెపాక గ్రామంలో భూ బాగోతం బట్టబయలైంది.గతంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయించిన విలువైన భూమిని, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపిస్తూ మంగళవారం గ్రామస్తులు కదం తొక్కారు.స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి, అక్రమ పట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించారు.
అక్రమ పట్టాల వెనుక భారీ కుట్ర:
ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ సుమలత ధర్మేందర్, గ్రామ నాయకుడు గట్టు ప్రదీప్ మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్లు 268, 269, 270, 271లలో ఉన్న సుమారు 5 ఎకరాల 24 గుంటల భూమిని రేగుల సాంబయ్య అనే వ్యక్తి అక్రమ మార్గాల్లో తన పేరున పట్టా చేయించుకున్నారని మండిపడ్డారు. గతంలో అయితరాజు రంగనాయకమ్మ పేరు మీద ఉన్న ఈ భూమిని, ఆమె భర్త రామారావు 2008లో మరణించిన తర్వాత, ఫిబ్రవరి 2026లో ఎటువంటి ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించకుండానే సాగు భూమిగా చూపిస్తూ అప్పటి తహసీల్దార్ పట్టా చేశారని ఆరోపించారు. వాస్తవానికి ఈ భూమి పేదలకు ఇళ్ల స్థలాల (హౌస్ సైట్స్) కోసం ఉద్దేశించినదని, దీనిని సాగు భూమిగా మార్చడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని వారు ధ్వజమెత్తారు.
ఆదేశాలు ఉన్నా అమలు చేయని వైనం:
మరో విస్తుపోయే అంశం ఏమిటంటే.. 1983లో ఆనాటి ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన సర్వే నంబర్ 1476 లోని భూమిని కూడా తడక సురేష్ అనే వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా, ఆర్డీవో స్వయంగా గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. సదరు భూముల పట్టాలను వెంటనే ‘హోల్డ్’లో పెట్టాలని తహసీల్దార్‌ను ఆదేశించినప్పటికీ, నేటికీ ఆ ఆదేశాలు అమలు కాకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తహసీల్దార్ కార్యాలయం ముట్టడి:
పట్టాల వివరాలపై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. రికార్డులు అందుబాటులో లేవని, వివరాలు సేకరించడానికి మరింత సమయం కావాలని చెబుతూ కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ప్రభుత్వ భూములను, పేదల ఇళ్ల స్థలాలను అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పొదిల కృష్ణ,బండారి రవీందర్, మెట్టేటి రమేష్, బొట్ల సాంబయ్య, కనకం రామన్, మార్కు,ముత్యారాములు,గ్రామ ప్రజలు గుంటి చంద్రమౌళి, బొట్ల చక్రపాణి, కునూరు రాజన్న, జూపాక మల్లేశం, మోడం సుభాష్, భాను, బిక్షపతి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.