
విద్యుత్ సిబ్బందికి సేఫ్టీ పాఠాలు చెప్పిన లైన్ ఇన్స్పెక్టర్ భూక్యా బాలు
ఈ69న్యూస్ జనగామ, ఆగస్టు 6
జనగామ డివిజన్ పరిధిలోని నర్మెట్ట మండలంలో విద్యుత్ నిర్వహణ పనులకు ముందు సిబ్బందికి భద్రతా అవగాహన కల్పిస్తూ లైన్ ఇన్స్పెక్టర్ భూక్యా బాలు నాయక్ ప్రత్యేక సేఫ్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు.గురువారం హన్మంతాపూర్ 11 కేవీ ఫీడర్‌కు సంబంధించిన ప్రత్యేక నిర్వహణ పనులు ప్రారంభించే ముందు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ టీం సభ్యులతో భద్రతా ప్రమాణాల ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా లైన్ ఇన్స్పెక్టర్, సేఫ్టీ మాస్టర్ భూక్యా బాలు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి వ్యక్తిగత రక్షణ పరికరాలు తప్పనిసరిగా ధరించి, అన్ని భద్రతా నియమాలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. విద్యుత్ పనులు ప్రారంభించే ముందు ‘వన్ మినిట్ రూల్’ను పాటిస్తూ ఒక నిమిషం పాటు భద్రత గురించి ఆలోచించి పనులు ప్రారంభించాలని యువ కార్మికులకు సూచించారు.త్వరగా పనులు ముగించాలనే ఆలోచనతో కొందరు భద్రతను నిర్లక్ష్యం చేసి తమ ప్రాణాలతో పాటు కుటుంబాల భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వ్యవస్థ ఎంతో విస్తృతమైనదని, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి “నాకు అన్నీ తెలుసు” అనే భావనకు బదులుగా నిత్య విద్యార్థిలా కొత్త విషయాలను నేర్చుకుంటూ, “భద్రతే ప్రథమ ప్రాధాన్యం” అనే నినాదంతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక లైన్మెన్ కె. వెంకటయ్య, అసిస్టెంట్ లైన్మెన్లు హేమంత్, సురేష్, రాజేందర్, మోహన్, శ్రీకాంత్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.