ఉప్పుగల్లులో దంస కెనాల్‌లో మట్టి చోరీ…పట్టించుకోని అధికారులు

ఈ69న్యూస్, జఫర్ఘడ్, మే 08
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం ఉప్పుగల్లు గ్రామ శివారులో ఉన్న దంస కెనాల్ కాలువలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పగలు-రాత్రి వేళల్లో జెసిబీ యంత్రాల సహాయంతో కాలువను లోతుగా తవ్వి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.ఈ కాలువ ద్వారా మండలంలోని పలు గ్రామాల మీదుగా ధంసా చెరువుకు సాగునీరు చేరుతుండగా, అక్రమ తవ్వకాల వల్ల కాలువ దెబ్బతిని నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కాలువను అధికంగా లోతు చేయడం వల్ల దిగువ ప్రాంతాలకు నీరు సరిగా చేరక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అక్రమ మట్టి తవ్వకాలపై ఇప్పటికే రెవెన్యూ , మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.