E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
22 నుంచి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్ర

- టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ నిర్ణయం
- సుబ్లేడులో షోయబుల్లా ఖాన్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభం
- నియోజకవర్గాల వారీగా కొనసాగనున్న యాత్ర
- విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులకు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి పిలుపు
- జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం ఈనెల 22వ తేదీ నుంచి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (హెచ్ – 2843) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టినట్లు చెప్పారు. నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన జర్నలిస్టు, కవి షోయబుల్లా ఖాన్ వర్ధంతిని పురస్కరించుకొని పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలోని అయన విగ్రహం వద్ద నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని వివరించారు. సుబ్లేడులో మొదలయ్యే ఈ పాదయాత్ర అక్కడి నుంచి నేరుగా తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండల కేంద్రాలతో పాటు ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీలో కొనసాగుతుందని వివరించారు. ఆయా ప్రాంతాల్లోని జర్నలిస్టులతో కలిసి సాగే ఈ పాదయాత్రకు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలపాల్సిందిగా కోరారు. ఇళ్ల స్థలాల సాధన కోసం నియోజకవర్గాల వారీగా సాగే ఈ పాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులకు పిలుపునిచ్చారు.