అన్నదాతల కంట కన్నీరు.. అస్తవ్యస్తంగా జనజీవనం!
అన్నదాతల కంట కన్నీరు.. అస్తవ్యస్తంగా జనజీవనం!
ఉమ్మడి మండలంలో తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరత – స్తంభించిన వ్యవసాయ పనులు
చేతికొచ్చిన పంటను కాపాడుకోలేక రైతుల ఆవేదన – నిలిచిపోయిన హార్వెస్టర్లు,ట్రాక్టర్లు
కొరత లేదంటున్న అధికారులు.. ఖాళీగా దర్శనమిస్తున్న బంకులు
పాలకుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
ఉమ్మడి రేగొండ మండలవ్యాప్తంగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత సామాన్య ప్రజలను, ముఖ్యంగా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది.ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే తరుణంలో, ఇంధన సంక్షోభం అన్నదాతల పాలిట శాపంగా మారింది. పంట నూర్పిడి పనులు జోరుగా సాగాల్సిన సమయంలో డీజిల్ దొరకకపోవడంతో యాంత్రీకరణ మొత్తం మూలకు పడింది.యుద్ధప్రాతిపదికన సాగాల్సిన పనులు స్తంభన,ప్రస్తుత రోజుల్లో వ్యవసాయం పూర్తిగా యంత్రాలపైనే ఆధారపడి ఉంది. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఉంటేనే పనులు వేగంగా సాగుతాయి.అయితే,మండలంలోని పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ నిల్వలు లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోయాయి.అకాల వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియని పరిస్థితుల్లో, చేతికొచ్చిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు.పంటను నూర్పిడి చేయలేక, ఒకవేళ చేసినా ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి ట్రాక్టర్లకు డీజిల్ లేక రైతులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు.”ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంటను కాపాడుకుంటే, ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం వల్ల పంటను అమ్ముకోలేకపోతున్నాం” అని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సామాన్యుల తిప్పలు.. ఆగిపోయిన రాకపోకలు:
పెట్రోల్ కొరత ప్రభావం సామాన్య ప్రజలపై కూడా తీవ్రంగా ఉంది. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లే వాహనదారులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు పెట్రోల్ కోసం బంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. బంకు యాజమాన్యాలు ‘నో స్టాక్’ బోర్డులు పెడుతుండటంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. కొన్నిచోట్ల లీటరు పెట్రోల్ కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.
అధికారుల ప్రకటనలు కంటితుడుపు చర్యలేనా?:
జిల్లా యంత్రాంగం,సరఫరా శాఖ అధికారులు జిల్లాలో ఇంధన కొరత లేదని,నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రకటనలు విడుదల చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.అధికారుల మాటలకు,వాస్తవ పరిస్థితులకు పొంతన లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ చేస్తున్నారా? లేక సరఫరాలోనే లోపం ఉందా? అన్నది స్పష్టం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
అధికార వర్గాలు తక్షణమే జోక్యం చేసుకొని, మండలంలోని అన్ని బంకులకు నిరంతరాయంగా ఇంధన సరఫరా జరిగేలా చూడాలని రేగొండ మండల ప్రజలు, రైతులు కోరుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన డీజిల్ పంపిణీ చేయకపోతే పంట మొత్తం పొలాల్లోనే పాడయ్యే ప్రమాదం ఉందని, తద్వారా తాము తీరని అప్పుల ఊబిలో కూరుకుపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.