వరంగల్‌లో నకిలీ నోట్ల గ్యాంగ్ బట్టబయలు–8 మంది అరెస్టు



ఈ69న్యూస్ వరంగల్, మే 4
వరంగల్ జిల్లాలో నకిలీ నోట్లను తయారుచేసి మార్కెట్లో చలామణి చేస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని టాస్క్‌ఫోర్స్ మరియు నర్సంపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నకిలీ కరెన్సీతో పాటు అసలు రూ.1,48,000 నగదు, సుమారు రూ.28 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, 13 సెల్ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, నర్సంపేటకు చెందిన ముగ్గురు నిందితులు అసలు రూ.100 నోట్లను ఆధారంగా తీసుకుని ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ల సహాయంతో కలర్ ప్రింట్ తీసి నకిలీ నోట్లను తయారు చేసి మార్కెట్లో చలామణి చేస్తున్నారు.మరో ఐదుగురు నిందితులు “తక్కువ డబ్బులకు ఎక్కువ డబ్బులు (1:3 నిష్పత్తిలో)” తయారు చేసి ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు.ఈ మోసంలో భాగంగా, అసలు రూ.500 నోట్లను అయోడిన్ ద్రావణంలో ముంచి నల్లగా మార్చి, ఆపై ‘హైపో’ (సోడియం థయోసల్ఫేట్) ద్రావణంలో ముంచితే మళ్లీ అసలు రూపం వస్తుందని నమ్మబలికేవారు. అదే విధంగా నల్ల కాగితాలను కట్టలుగా ఇచ్చి అవి నిజమైన నోట్లుగా మారుతాయని చెప్పి బాధితుల నుంచి అసలు నగదు దోచుకుని పరారయ్యేవారు.ఇదే తరహాలో గతంలో ఘన్పూర్ (ములుగు), మోండా మార్కెట్ (సికింద్రాబాద్), వేంసూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో కూడా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.ఇటీవల హైదరాబాద్‌లోని చత్రినాక, నర్సంపేట ప్రాంతాల్లో కూడా మోసాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు బాబులాల్, శ్రీనివాస్, ఏఏఓ సల్మాన్ పాషా మరియు సిబ్బందిని సీపీ అభినందించారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.