రైతాంగ ధర్నాలను విజయవంతం
తెలుగు గళం న్యూస్ బచ్చన్నపేట, జూన్ 14
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూన్ 19,20 తేదీలలో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించనున్న రైతాంగ ధర్నాలను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బచ్చన్నపేట మండల కేంద్రంలో రైతాంగ ధర్నాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రెండు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేశారని, పెండింగ్లో ఉన్న గత వానకాలం, ప్రస్తుత యాసంగి రైతు భరోసా నిధులు, సన్నధాన్యం బోనస్ బకాయిలను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ రంగంలో విద్యుత్ ప్రైవేటీకరణకు దారితీసే రైతు డిస్కంను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, రైతులపై అదనపు భారం మోపే నిర్ణయాలను నిలిపివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పొటాష్, భాస్వరం, కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించి రైతులకు తగినంత ఎరువులు అందుబాటులో ఉంచాలని అన్నారు.
యూరియా బుకింగ్ యాప్ కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం వ్యవసాయ రంగానికి 18 శాతం పంట రుణాలు అందించి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు.
అదేవిధంగా కిసాన్ సమ్మాన్ పథకాన్ని జిల్లాలోని అర్హులైన రైతులందరికీ వర్తింపజేయాలని, ఏఈవోలు క్లస్టర్ స్థాయిలో క్షేత్ర సందర్శనలు చేసి క్రాప్ బుకింగ్ నిర్వహించాలని సూచించారు. నకిలీ, కల్తీ విత్తనాల నివారణకు సమగ్ర చట్టం తీసుకురావాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న జూన్ 19,20 తేదీల రైతాంగ ధర్నాలలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రామావత్ మీట్యా నాయక్, జిల్లా కమిటీ సభ్యురాలు మోకు భవాని, సీనియర్ నాయకులు గురజాల లక్ష్మీనర్సింహారెడ్డి, మద్దోజు రామచొక్కం, బండకింది బాల్ నారాయణ, సాంబరాజు దుర్గాప్రసాద్, తాండ్ర ఆనందం, వెంకటమ్మ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.