విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్
విలేకరులపై దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని,ఆయనను పదవి నుంచి తొలగించి కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రేగొండ మండల విలేకరుల సంఘం (ప్రెస్ క్లబ్) డిమాండ్ చేసింది.ఈ మేరకు శనివారం రేగొండ ప్రెస్ క్లబ్ ముఖ్య కార్యవర్గ సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేశారు.రేగొండ మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు భూపాలపల్లి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ క్రమంలో రేపాక గ్రామంలో జరిగిన కార్యక్రమ వార్తా సేకరణ (కవరేజ్) కోసం వెళ్లిన విలేకరులను ఉద్దేశించి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ,”ఏం రాసుకుంటారో రాసుకోండి” అంటూ తీవ్రంగా అవమానించారని పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు.బాధ్యతాయుతమైన ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి,ప్రజాసేవలో ఉన్న విలేకరుల పట్ల ఇలా ప్రవర్తించడం పద్ధతి కాదని మండిపడ్డారు.ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి చైర్మన్ కిష్టయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.చైర్మన్‌పై తగిన చర్యలు తీసుకునేంత వరకు రేగొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలను కవర్ చేయకూడదని,ఆ కార్యక్రమాలను బహిష్కరిస్తూ ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సభ్యులు స్పష్టం చేశారు.