నేటి జైల్భరో కార్యక్రమానికి మత్స్యకారుల సంపూర్ణ మద్దతు
తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తరాల చంద్రబాబు, కార్యదర్శి మునిగెల రమేష్
కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, మత్స్యకార వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్భరో కార్యక్రమానికి తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జనగామ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.జిల్లాలోని మత్స్యకారులు, మత్స్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జైల్భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మునిగెల రమేష్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మత్స్యకారులు, మత్స్య కార్మికులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మత్స్యకారుల జీవనోపాధికి రక్షణ కల్పించడం, చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు భద్రత కల్పించడం, మత్స్యకారులకు సంక్షేమ పథకాలు, ఉపాధి, సామాజిక భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే విధానాలను ఉపసంహరించుకుని, వారి హక్కులను కాపాడేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ప్రమాదాల్లో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్లో ఉన్న బీమా సొమ్ము, ఎక్స్గ్రేషియా వెంటనే అందించాలని కోరారు. దేశవ్యాప్తంగా సముద్ర ప్రాంత, మైదాన ప్రాంత మత్స్యకారులకు వేర్వేరుగా ప్రత్యేక సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి, వాటికి బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని, మహిళా సంఘాలకు ప్రత్యేక రుణ సౌకర్యం అందించాలని కోరారు.మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని, ప్రజా ఉద్యమాల ద్వారానే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని మునిగెల రమేష్ పేర్కొన్నారు.ఆగస్టు 10న జనగామ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహించే జైల్భరో కార్యక్రమంలో మత్స్యకారులు, నాయకులు, మత్స్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జనగామ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.