ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవం

ఇంటింటా మలేరియా సర్వే.. రక్త నమూనాల సేకరణ – 63 మందికి ఆరోగ్య పరీక్షలు, 69 మందికి ఎక్స్రే స్క్రీనింగ్
సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం కీలకం – గ్రామపంచాయతీ సర్పంచ్ పర్షిక శ్రీలత
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏదిర గ్రామపంచాయతీలో గురువారం ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవితేజ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సర్పంచ్ పర్షిక శ్రీలత సమక్షంలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటా మలేరియా సర్వే చేపట్టి రక్త నమూనాలు సేకరించారు. దోమల నియంత్రణ, డ్రై డే కార్యక్రమం, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. అదేవిధంగా వైద్యాధికారి డాక్టర్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జాతీయ క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాత్రిపూట జ్వరం, రెండు వారాలకు మించి దగ్గు, కఫంలో రక్తం పడటం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉన్న వారికి ఎక్స్రే స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టారు. గ్రామస్తుల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి 63 మందికి ఆరోగ్య పరీక్షలు, 69 మందికి ఎక్స్రే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్రజలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్య సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పర్షిక శ్రీలత, డాక్టర్ పవన్ కళ్యాణ్, ఆరోగ్య విస్తరణ అధికారి కుప్పిలి కోటిరెడ్డి, ఎస్టీఎస్ వెంకటేశ్వరరావు, ఏఎన్ఎంలు కృష్ణకుమారి, లక్ష్మి, ఆరోగ్య సహాయకులు రాంబాబు, చిన్న వెంకటేష్, ఎల్టీ ప్రవీణ్ కుమార్, టీబీ ఇండియా కోఆర్డినేటర్ రాజు, ఎక్స్రే టెక్నీషియన్ సంతోష్, విజయ్ కుమార్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
